Loading...

16, మే 2016, సోమవారం

తీరదుగా!

కలలోనూ గానని కనకపుధారలు కురుస్తాయి.
కావాలనుకున్న చిన్నిఆశ తీరుతుందా?
చిట్టి చిట్టి చినుకులు నదులన్నీ నింపేస్తాయి.
చిన్ని పుక్కిలిని ఆశ తీరా నింప గలవా?
వద్దనుకున్నా వేలజన్మలు వస్తూనే ఉంటాయి,
తప్పటడుగు వేయకుండా అడుగేయడం వస్తుందా?

2, మే 2016, సోమవారం

ఋతుక్రతువు

ఋతుక్రతువు
రచన : లక్ష్మీదేవి

వసంతఋతువు -
ఉ. వేచె విభుండు వచ్చునని వేయి నిరాశలఁ గాలఁ దన్నుచున్
పూచిన సన్నజాజులను పొందిక కొప్పునఁ జుట్టి, గంధముల్
వీచెడు గాలులందు నిడి, ప్రేమగ స్వాగతగీతి కోయిలన్
దాచిన గొంతుతో పలికెఁ, దా వనకన్య వసంతురాకకై.
గ్రీష్మఋతువు -
చం. భగభగ మండు టెండలకు బావులు, కాలువలెండిపోవగా,
దగఁ గొని, నీడకోరి, రహదారులఁ సాగెడు గడ్డురోజులన్
సెగలను తాళలేక యిల జీవులు వాడి తపింప, గ్రీష్మమున్
పగను శపించుచుండిరిక పంతముతో నసహాయ మానవుల్.
వర్షఋతువు -
చ. చిటపట సద్దు చేయుచును చేరును జల్లులు నింగి వీడుచున్,
పటపట రేకు పైఁ సడుల, పచ్చని చెట్టులు తానమాడ, తా
మటునిటు సాగు కాలువల యందున నల్లరి పిల్లమూకలన్
కటువుగ పెద్దలెల్ల యిడు గర్జన పోలెడు మేఘమాలికల్
దిటవుగ నిండునాకసము, దిక్కదె వర్షపు వేళ జీవికిన్.
శరదృతువు -
ఉ. చల్లని వెన్నెలెల్ల యెడ సైయను జంటల కాంక్షమాడ్కినిన్,
చల్లని పిండులో యనగ, జాజుల మల్లెల పాన్పులో యనన్,
తెల్లని పాల సంద్రమన దిక్కులముంచెను, తేటగా నదుల్
పల్లెల పట్టణమ్ములను పారెను పంటల దాహమార్చుచున్.
హేమంతఋతువు -
చం. చలిపులి మెత్త కత్తులనుఁ జంపుచునుండగ వృద్ధకోటి, లో
పలకునుఁ జేర వెచ్చనగు పానుపుకోరుచుఁ ,బంటదుప్పటుల్
పలుచగ భూమిఁ గప్పె, నెల ప్రాయము కాచెను నెల్ల జంటలన్,
తెలి విరులెల్ల తీర్చె నిక తీరగు చుక్కల నింగిగా నిలన్.
శిశిరఋతువు -
ఉ. పత్రములెల్ల రాల్చి నవపల్లవ కోమల శోభఁ గోరుచున్
చిత్రము చేయునా శిశిరజృంభణ హేల! సదా చలించు, నే
మాత్రము దారి తప్పదు సుమా, ఋతుచక్రము! పెక్కు భంగులన్
గాత్రము మార్చునీ పృథివి కన్నుల పండుగగాగఁ జేయుచున్.
---లక్ష్మీదేవి.

26, ఏప్రిల్ 2016, మంగళవారం

నల్లమబ్బు తేరునెక్కి----

నల్లమబ్బూ తేరునెక్కి
చల్లగా నువు చేరవస్తే-
ఉల్లమెల్లా ఉలికిపడెనూ,
ఝల్లుమనెనోయ్, చందమామా!


మెల్లమెల్లన గాలి వీచె
అల్లనల్లన పూలురాలె
జల్లులందున ఆటలాడ
ఎల్లవలెనోయ్ బేగరారా!

మల్లెపందిరి నీడలోనా
కొల్లకొల్లగ సుద్దులుండగ
కల్లలెరుగని చెలికి చెప్పక
 తల్లడిల్లగ నీకు తగదోయ్!
-----లక్ష్మీదేవి.21, ఏప్రిల్ 2016, గురువారం

సరస్వతీ ప్రార్థన.

సరస్వతీ!


రచన : లక్ష్మీదేవి

శార్దూలము
         విద్యార్థుల్ నిను వేడుకొందు రిలలో వీణాధరీ! దీవనల్
సద్యోగంబుల నిమ్ముశుద్ధచరితా! శాతోదరీ! పావనీ!
పద్యం బన్నను నీరస మ్మనక పక్వంబౌ మహాశ్రద్ధతో
నుద్యోగమ్మున నేర్చుకొ మ్మనుచు నీ వొప్పింపగా రాగదే!

మత్తేభము
         కరమున్ బట్టుదు పుస్తకంబుమనమున్ కైంకర్యమున్ జేతునీ
దరికిన్ బిల్వుము శారదా! చదువులన్ దానంబుగా నిచ్చినన్,
వరముల్ వేరుగ నేల చాలు నదియేవాణీ! సదాచారిణీ!
స్థిరమౌ దృష్టిని నన్ను గాచుకొనుమా శ్రీమంగళాకారిణీ!

పంచచామరము
సదా మదిన్ దలంతు నిన్ను శ్రద్ధతోసరస్వతీ!
పదమ్ము లిట్లొసంగుమా! కృపామయీసరస్వతీ!
ముదమ్ముతోడఁ దీర్చుకొందు మ్రొక్కులన్సరస్వతీ!
పదమ్ముఁ జేరుకొందుమోక్ష ప్రాప్తికైసరస్వతీ!

మత్తకోకిల
వీణఁ బట్టిన శారదాంబకు వేశుభమ్ములు పల్కుమా!
ప్రాణికోటికి విద్యనిచ్చెడు భారతీ జయ మందుమా!
పాణిఁ బట్టిన ధాతృపత్నికివందనమ్ములు పల్కుమా!
వాణిపుస్తకపాణికిన్, జగవంద్యకున్ శుభమందుమా!

-----------లక్ష్మీదేవి.


శంకరాభరణం బ్లాగులో ప్రచురింపబడిన నా ఖండిక.
ప్రచురించి ఆశీర్వదించిన గురువుగారికీ, కవిమిత్రులకూ, పెద్దలకూ నమస్కారములు.

8 వ్యాఖ్యలు:

 1. చక్కని పద్యాలు. అభినందనలు.
  ‘ముజ్జగ వంద్యకు’ అనరాదు. “వాణి, పుస్తకపాణికిన్, జగవంద్యకున్..’ అనండి.
 2. సరస్వతీ!యటంచు మీరు శారదన్ స్తుతించుచున్
  శిరస్సు వంచి మ్రొక్కినంత శీఘ్రమే వరమ్ములన్
  మరింత వ్రాయగల్లు భావ మాధురీ మహత్తులన్
  నిరంతరమ్ము నిచ్చు మీకు నేర్పులన్, సమున్నతిన్!

 3. గురువుగారూ,
  కృతజ్ఞురాలను. మీ సవరణ శిరోధార్యము.
  నాకొక సందేహము.
  ఖండకావ్యమనగా ఏదైనా ఒక విషయమును గొని ఉపోద్ఘాతము, ఘటన/ఇతివృత్తం, ఉపసంహారము ఉండాలని ఇన్నాళ్ళూ అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చిన ఖండకావ్యములను చూసి నేనూ ఇలా ప్రారంభించాను. కేవల వర్ణనలను, స్తుతులను ఖండకావ్యములనవచ్చునా? వివరింపవలసినది.

 4. అయ్యా, అంతకన్న భాగ్యమా? ధన్యురాలనౌదును.

 5. ఆదిగురువు మనిషికమ్మ|సరస్వతే|
  వాక్కు నేర్పు తల్లి వాణిగాద?
  భవిత బంచి పెట్టు భారతి బాధ్యతే
  లక్ష్మి|దేవిరచన లక్ష ణంబె|
 6. లలిత పదముల లాస్య విలాస భరిత
  సతత వృత్యనుప్రాసల శారదాంబ
  స్తుతిని జేయ “లక్ష్మీదేవి” సుగుణరాశి
  భార తీదేవి యిచ్చుత భవ్యముగను.
 7. శారదమ్మమీదచక్కనిగృతులను
  రచనజేసినట్టిరమ్యచరిత!
  యింకనురచనలనునింపుగామరికొన్ని
  యందజేయుమిపుడయభ్ధిపుత్రి!
 8. శారదాంబకు చక్కని చామరము వీచారు...బాగుంది.

30, జనవరి 2016, శనివారం

సుద్దులివ్వే, వినుమమ్మ!

                             
                               
                              ముద్దులొలికేమోమునందువెన్న
                                ముద్దలు పెట్టగలిగేపున్నెమున్న
                                ముద్దరాలు యశోదమ్మ!

                                ముద్దుగురిసే మోమునందు తీపి
                                 ముద్దులు పెట్టగలిగే వన్నె కన్నె
                                ముగ్ధరాలు గోపికమ్మ!

                               ముద్దారగా మాధవుని దలచే,
                               విద్దె నేర్చి పాడగలిగే, చిన్ని తల్లి
                               సుద్దులివ్వే, వినుమమ్మ!
                                                - లక్ష్మీదేవి.