Loading...

22, జూన్ 2011, బుధవారం

అయోమయం


ఏమిటో నాకు వింతగా అనిపిస్తుంది.భయంగా ఉంటుంది, భవిష్యత్తును తలచుకుంటే. కూరలో, సరుకులో ఏం కొనాలని వెళ్ళినా ఈరోజు ఉన్న ధరలు ఇంకో రెండు రోజుల్లో ఉండవు. అమాంతం అంతలా ఎలా పెరుగుతాయో , ఏమో అంతా అయోమయంగా ఉంటుంది. కూరలన్నీ యాభయ్, అరవైల్లో నే ఉంటాయి. పప్పుల ధరలూ అలా పెరిగిపోతూనే ఉన్నాయి. కొబ్బరినూనె నేను సీల్డ్ ది కొనను. విడిగా కొని కాస్తాను. వెళితే ఒకేసారి యాభయ్ రూపాయలు లీ.కు పెరిగింది. వాళ్ళు చెప్పింది మనం నమ్మాలి కదా!

వ్యాపారం చేసేవాళ్ళు సాధారణంగా అబద్ధం చెప్పరనను. కానీ పక్క అంగట్లో ఉన్నధరకు మరీ తేడా ఉండేలా వాళ్ళూ చెప్పలేరని ఒక నమ్మకం. ఎప్పుడూ కొనే చోట్ల అంగడి వాళ్ళను నమ్మకుండా ఎలా జరుగుతుంది? ఆటో వాళ్ళు ఉన్నట్టుండి పెంచేస్తారు. ఇంకో ఏరియాలొ ఇదే దూరానికి అలా తీసుకోరని తెలిసినా ఇవ్వాల్సిందే వీళ్ళకు.

ఏం చేద్దాం? ఎందుకు పెరుగుతాయో, ఎలా పెరుగుతాయో , ఎప్పుడు పెంచాలని నిర్ణయం తీసుకుంటారో, అక్కడ ఎక్కడో సమ్మెలు జరిగితే వీళ్ళెందుకు పెంచుతారో , ఏమో ! ఏం తెలీట్లేదు. పోన్లే ఇవన్నీ ఎంతయినా ఒకట్లు, పదులే కదా పోనిద్దూ అనిపిస్తుంది, టీ.వీలూ, ఫాన్లూ, ఏసిలూ, ఎమ్ పి ౩ ప్లేయర్లూ, ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నా వ్యాపారస్తుడు చెప్పింది నోరుమూసుకొని ఇస్తున్నాం కదా , ఇక్కడ ఏం మిగిలించుకుంటాం అనిపిస్తుందికదా! ఈ రోజువారీ వస్తువులు నిత్యావసరాలు. ఇవి లేకపోతే ఏం తింటాం, ఎలా బ్రతుకుతాం ? టీ.వీలూ గట్రా లేకపోతే జీవనం ఆగిపోదు. తిండీ, నీళ్ళూ లేకుండా మనుగడ ఎట్లా?
కొన్ని ప్రాణులు చక్క గా గాలి , నీళ్ళు పీల్చి బ్రతుకుతూ ఉంటాయి. అదే నయం . ఔను మరి మొక్కలు గాలి, నీళ్ళు పీల్చి బ్రతుకుతున్నాయి. మనం అలా ఉంటే ఎంతబాగుండేదో! మనిషై పుట్టే కన్నా అడవిలో మానై పుట్టడం మేలంటారు కదూ! నూటికి నూరుపాళ్ళూ నిజం సుమండీ. ఉన్న చోటునుండి కదలకుండా అన్ని జీవులకూ సహాయం చేయవచ్చు. మన మనుషులు ఉన్నారే , ఎన్ని ఉన్నా చాలవు మనకు. శాకాహారులం కొంతలో కొంత నయం. కదలని ప్రాణులు అదే మొక్కల్లోంచి వచ్చే కూరలు, ధాన్యాలు వంటివి సరిపోతాయి. మాంసాహారులు అయితే కదిలే ప్రాణుల్నీ వదలరు. ఇంకానయం చైనా వాళ్ళ ఆహారపు అలవాట్లు తెలిశాక మిగిలిన మాంసాహారులు నయం అనిపిస్తుంది. వాళ్ళు పాముల్నీ , కప్పల్నీ కూడా వదలరుట.

ఇకమీదట మనుష్యుల్ని తినేవాళ్ళు కూడా వస్తారంటారా? అయితే జనాభా అయినా తగ్గుతుందేమో. (జోక్ పేలలేదా!!!)
మనదేశం వ్యవసాయ ప్రధాన దేశం అని పుస్తకాల్లో చదవటమే కానీ మన పరిచయస్తుల్లో ఎంత మంది వ్యవసాయం చేస్తున్నారు చెప్పండి? పొలాలు ఉన్నాయి కౌలుకిచ్చాం అని చెప్పేవాళ్ళు లెక్కలేదు. మనకున్న భూమి ఎంత? ఎంతమంది ఇష్టపడి చేస్తున్నాం ? అబ్బే మనకు రిస్కు ఎందుకు అని నెలజీతాల మోజులో పడి ఏదో బ్రతికేస్తున్నాం. మనం ఇలా ఉంటే దేశం ఎప్పటికి బాగుపడేను? ఎప్పుడు ధరలు తగ్గేను? మనకు కావలసినవన్నీ కావలసినంత పండిస్తే ఇంతలా ధరలు ఎందుకు పెరుగుతాయి? అలాంటి రోజులు సమీప భవిష్యత్తులో కనిపించటం లేదు. అందుకు తగిన ప్రయత్నం మనం చేయటం లేదు. అది నిజం. అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.

18, జూన్ 2011, శనివారం

మనసాయెరా మాధవా!

మనసాయెరా మాధవా!

మగువను నే మగువను
మొగసాలకు నే రాలేనురా!


మధుమాసమ్మిది గనవేమిరా!
మధువులు గొన మరులే లేవా?

మరిచితివా నను మరిమరినీవే
తలచితివా ఇటు రార నా సామి

మాయని మమతల గురుతుల
మనసున నింపగ తరలిరారా!

మదిముంగిలిలో స్వాగతమిడ
నే నిలిచి యుంటినే గనవేమి రా?

-లక్ష్మీదేవి


16, జూన్ 2011, గురువారం

3, మే 2011, మంగళవారం

ఈ మాట ఈ పత్రికలో అపురూపమైన ప్రముఖుల గొంతుకలు (లంకె )

ఈవేళ టంగుటూరి ప్రకాశం పంతులు, మాన్య ప్రథమ ముఖ్యమంత్రులు - వారి గొంతు విన్నాను.ప్రముఖ సాహితీవేత్త పుట్టపర్తి నారాయణాచార్యులు గారి గొంతు విన్నాను. ఇదిగో లంకె.
నా అభిమాన ఈ పత్రికల్లో ఒకటైన ఈమాట కొత్త సంచికలో ఇవన్నీ ఉన్నాయి.
పరుచూరి శ్రీనివాస్ గారు వీరితో పాటు గుఱ్ఱం జాషువా , పింగళి లక్ష్మీకాంతం, ఆచంట లక్ష్మీపతి, మునిమాణిక్యం నరసింహారావు, దామోదరం సంజీవయ్య, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి , జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, మొక్కపాటి నరసింహ శాస్త్రి, తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి, తిలక్, విస్సా అప్పారావు గారి గొంతులు కూడా ఉన్నాయి. నేనింకా కొన్ని వినాలి.

పరుచూరి శ్రీనివాస్ గారికి మరీ మరీ మరీ మరీ మరీ ధన్యవాదాలు.

27, ఏప్రిల్ 2011, బుధవారం

నల్లనీ సందురూడు నామామ

నల్లనీ సందురూడు నామామ
సల్లనీ సూపులోడు నామామ!
మల్లెవంటి మనసున్న నామామ
అల్లదిగో వస్తన్నడునామామ!!

కల్లకపటమెఱుగనోడునామామ
మల్లమల్ల ముఱిపించు నామనసును
బుల్లిబుల్లి పిల్లలంటె ముచ్చటాడికి
మల్లిమల్లి ఆటలాడు ఆళ్ళతోడనె!

తెల్లనోడు నింగిలోన చందమామ
సల్లనోడు ముంగిల్లోన నామామ
వెళ్ళవోయి జాబిల్లి నిన్ను నమ్మను
వొల్ల నేనింకొకరిని ఈ జన్మకు!

         ---లక్ష్మీదేవి