Loading...

9, ఆగస్టు 2014, శనివారం

రఘునాథభూపాలుడు - తంజాపురాంధ్రవీణ (2)

 
రఘునాథభూపాలుని ప్రత్యేకత
రఘునాథ భూపాలుడు కవిరాజు. సమకాలీకులలో ప్రత్యేకస్థానము పొందినవాడు. రాజస స్ఫూర్తికన్నా సాత్విక కవితా స్ఫూర్తిని కలిగించునట్లు వ్రాయుటలో దక్షుడు. రఘునాథుని మాటనేర్పఱితనమును కవి చౌడప్ప స్పష్టముగా పేర్కొనెను.
రఘునాథుని యందు గల ఖడ్గచాలనాపాటవము, శౌర్యము, కులీనత్వము, ధార్మికత్వము, కావ్యగీతిప్రియత్వము, గుణాధిక్యత, ఉదారగుణములు నిరుపమానములు. అన్ని కావ్యములను ఉత్తమకవుల తృప్తి కొఱకు, సహృదయుల సమ్మతము కొఱకు రచించినట్లు తెలిపెను. తాను పొందిన ప్రతిభాయుక్త కవిత్వ సంపదతో శ్రీరామచంద్రుని కరుణారసపూరిత కటాక్షవీక్షణముల వలన కావ్యకన్య స్వరూపమును నిర్మించి రామునకే అర్పించుట స్వీయ కర్తవ్యముగ భావించెను.
   రఘునాథ నాయకుడు పరిపాలనయందు,  కవిత్వపోషణ యందు, లలితకళలప్రోత్సాహపఱచుటయందు, వ్యక్తిత్వమునందు కృష్ణదేవరాయలను అనుసరించినవాడు. కవిత్వమున మాత్రము వీరికి పోలిక లేదు. కృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద, సత్యవతీ వధూప్రీణము అనునవి రెండును పండితులకు, విద్వాంసులకు కూడ అవగతమగుట కొంత కష్టమందురు. రఘునాథుని కృతులన్నియు చివరకు శాస్త్రగ్రంథమగు సంగీతసుధ కూడా సంగీత పరిజ్ఞానవంతులకు కూడ అవభోన్నిధ్యములగును.
   సంస్కృతకవులను , కవయిత్రులను , శాస్త్రజ్ఞులను పోషించినప్పటికీ, తాను ఎక్కువ తెలుగుభాషలోనే రచనలు చేసెను.
  అమూల్యమగు గ్రంథములను ప్రజలచే సేకరింపజేసి ఇప్పటి తంజావూరు లోని "సరస్వతీమహల్ " అను గ్రంథాలయము ఏర్పడుటకు కారణభూతుడయ్యెను. స్వయముగ కళాహృదయుడు, వాగ్గేయకారుడు, నాటకకర్త, సూత్రధారి. తమిళదేశమున తెలుగుభాషను, సంస్కృతిని అభివృద్ధి చేసినాడు. ద్విపదకావ్యములను రచించి ప్రజాకవితకు దారి చూపినాడు. యుద్ధవ్యూహమున ఎంత నిపుణుడో వివిధ కావ్యరచనా ప్రక్రియలందు అంతటి ఘనుడు.
    అన్నదానములను, యజ్ఞయాగాదులను చేసి ప్రజలలో వైదిక భావములను ప్రేరేపించినవాడు. కులమత వివక్షతను తొలగించి సర్వమత సామరస్యముతో ప్రజలను పాలించినవాడు. ఆచరణలో ఆదర్శాలను చూపినవాడు. దేవాలయమును అభివృద్ధి చేయుటయే కాక విద్యాలయములను స్థాపించినవాడు. (నేటికిని కుంభకోణమున ఇటువంటి విద్యాపీఠములున్నవి.) సంగీతకళాకారులకు, కర్ణాటక సంగీతమునకు సరిక్రొత్త దగు "రఘునాథ మేళవీణ"ను కనిపెట్టి సహాయము చేసినవాడు. జయంతసేన అను రాగమును కనిపెట్టి సవిస్తరముగా తెలియజేసెను.
          చక్కటి క్రమశిక్షణ కలిగిన ఆతని దినచర్యను సమకాలీనులు అత్యున్నతముగ వర్ణించిరి. సమకాలీనులచే పొగడబడుటకు ఈతని వ్యక్తిత్వమే కారణం.
రాజకీయ సాహిత్య పరములుగ రఘునాథుడు అపారమగు సేవచేయుటవలన ఈ నగరము సరస లలిత కళలకు నేటికీ స్థానమై యున్నది.
           శ్రీకృష్ణదేవరాయలు యావద్దక్షిణభారతమును ఏకచ్ఛత్రము క్రిందికి తెచ్చినాడు. కాని తదుపరి తల్లికోట యుద్ధమున, తురుష్కుల దౌష్ట్యమున తల్లిగడ్డ వల్లకాడైపోయినది.  విజయనగరధ్వజము క్రింద ఏర్పడిన ఆంధ్ర సామ్రాజ్యము తమిళనాడు నడిబొడ్డునకు తరలిపోయినది. అక్కడ అవతరించిన మరొక్క రాయలే రఘునాథ భూపాలుడు.
అంతటి రఘునాథుని గురించి సమగ్ర సుందరముగా రూపొందించిన పరిశోధనాగ్రంథమునుండి సేకరించిన కొన్ని విశేషాలివి. పరిశోధకులు డాక్టరు రామాపంతుల లక్ష్మీకామేశ్వరరావు , ఆంధ్రోపన్యాసకులు- సివిల్ ఇంజనీరు. ప్రచురించినది తెలుగు విశ్వవిద్యాలయము.
వారికి నా మనఃపూర్వక ప్రణామములు. వారి 450 పేజీల పరిశోధనా గ్రంథము నుండి ఈ చిన్ని పరిచయము భారతీయులకు చేయదల్చిన నా చిరుప్రయత్నాన్ని సహృదయులు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

4, ఆగస్టు 2014, సోమవారం

రఘునాథభూపాలుడు - తంజాపురాంధ్రవీణ


             తంజాపురాంధ్రరాజులలో రఘునాథ నాయకుడు కవిరాజు. ఈతడు కృష్ణదేవరాయల వలె రాజ్యప్రతిష్ఠకొఱకు యుద్ధం చేసినా, సాహిత్యపోషణ యందునూ సమానశ్రద్ధ చూపినాడు.అన్ని విద్యలనూ నేర్చుకొనినపిదప తన సంగీత సాహిత్య ప్రావీణ్యతను తండ్రి కోరగా సభలో ప్రదర్శించి సభాసదులమెప్పు పొందుటయే కాక తండ్రైన అచ్యుతప్పనాయకునిద్వారా మణులచే అభిషేకించబడెను.

   ఈతని ఆస్థానమునందు చేమకూర వేంకటకవి వంటి ప్రముఖ కవులే కాక రామభద్రాంబ, మధురవాణి , రంగాజమ్మ వంటి పేరొందిన కవయిత్రులూ, నారాయణతీర్థులు, యజ్ఞనారాయణదీక్షితులు, సుధీంద్రయతి మొదలైన కవులూ ఉండేవారు.
ఈతని ప్రజాసేవాతత్పరత కావ్యనాటక సంగీతనాట్యములందే కాక సంగీత వాద్య పరికరముల నిర్మాణమునందు అజరామరమగు కీర్తిని సంపాదించిపెట్టినది.

            ప్రస్తుత వీణారూపము ఈతను తయారు చేసిన రఘునాథ మేళవీణయే. అంతియేకాక జయంతసేన అను రాగమును కూడ రూపొందించి ప్రసిద్ధిపొందెను.
ఈతని రచనలు -ఏడు మాత్రము దొరికినవి.
పారిజాతాపహరణము- ఆశుకావ్యము ,అలభ్యము    |        
అచ్యుతాభ్యుదయము- ద్విపద అలభ్యము             |
గజేంద్రమోక్షము - అలభ్యము                           |
రుక్మిణీ కృష్ణవివాహము - అలభ్యము                  | 
జానకీపరిణయము - చాటుకావ్యము,అలభ్యము      |                 -------తెలుగు
నలచరిత్ర - ద్విపద, లభ్యము                           |
సావిత్రీ చరిత్ర - చంపూ , లభ్యము                      |
రామాయణము - చంపూ,లభ్యము                    |
వాల్మీకి చరిత్ర -లభ్యము , ప్రబంధము                 |

రామాయణసార సంగ్రహము -  లభ్యము            | 
భారతసారసంగ్రహము- లభ్యము                     |               - సంస్కృతము
సంగీతసుధ - లభ్యము                                |
భరతసుధ - నాట్యకావ్యము,అలభ్యము              |
ప్రభుత్వప్రాచ్యలిపి పుస్తకభాండాగారమున ఉన్న వ్రాతప్రతుల్లో సరళభాషలో ఉన్నప్పటికీ గ్రంథలిపి సాధారణులకు అర్థం కాదు. అన్నింటినీ తన కులదైవమైన రామునికి అంకితమిచ్చెను.

గంభీర సన్నివేశములను కూడా ఆకర్షణీయమైన శైలిలో సుగమమగు భావప్రకటనతో చిత్రించుట ఈ కవి ప్రత్యేకత.
           "కవిత్వము పండితుల సభలందు వినిపించినపుడు శృతిసుఖముగ ఉండుటయే గాక భావసౌందర్యము సరస హృదయులచే ఆస్వాదింపబడవలెను." --రఘునాథ భూపాలుడు.
         ఈతని కవిత్వము ఈ విధముగనలంకరింపబడినది అనుటలో ఎట్టి సంశయము లేదు.
ఈతని రచనలలో పాండిత్య ప్రకర్ష ఎంతున్నదో వినయము అంతే ఉన్నది. సంయమనంలో ఉత్సుకత,ఆవేశము , ఉద్విగ్నతలను సక్రమ పద్ధతిలో చిత్రీకరించును.

    మనోహరములగు పాత్రల స్వభావములను సహజ సుందరమగు ఆకర్షణీయ రీతిలో వర్ణించుటను "జాతి" అందురు. జాతికి స్వభావోక్తికి భేదము గలదు. స్వభావోక్తి యందు కొంతశబ్ద ప్రాధాన్యత ఉండును. జాతి వస్తువు యొక్క స్వభావ ప్రకటన యందు అర్థ గాంభీర్యమునకు భావమునకు ప్రాధాన్యత ఉండును.
   వర్ణించుచున్నవిషయమును కన్నులకు కట్టినటుల హృదయమునకు హత్తు నటుల అనుగుణమగు దేశకాలవాతావరణములలో వాస్తవమును ఆపాదించుచు రచించుటను "వార్త" అనవచ్చును.
ఈ కథాకథన నైపుణ్యమును రఘునాథుడు తన కావ్యములంతటా ప్రదర్శించెను. నాటి అంతఃపురమర్యాదలను, రాజోచిత మర్యాదలను, రాజులకు పౌరులకు గల సంబంధబాంధవ్యములను తలపింపజేయునటుల రచించినాడు.
రఘునాథుని చిత్ర కవిత్వమునకు ఒక ఉదాహరణ. సావిత్రీ చరిత్రయందు తనకు ప్రత్యక్షమైన విష్ణుమూర్తిని స్తుతించుటను అందమగు కుండలి నాగబంధమున పొందుపఱచెను.

శేషశయనుని గొప్పతనమును, లీలలను పేర్కొనుటకు శేషరూపమును ఉపయోగించెను.
చ. నరహరి దేహసార సుజనా జగదుత్తమ యేకవీర మం
    దరధర పూతహార సర నారద విగ్రహ గౌరమేదు రాం
    బర శుక మోదకార జనమానవ వర్ణిత శౌరి కో విదా
    చరణ రమా మనోరమణ బాణ కరచ్ఛిద ధీరపావనా!

  కవిగా పుష్పాపచయ వర్ణనలో యమక రగడ ప్రయోగించినపుడు శ్లేష, నలచరిత్రలో స్వయంవర సభలో అనేకులైన రాజులను వర్ణించేటపుడు క్షణక్షణము పదములను మార్చుచు చాతుర్యమును జూపెను. సంస్కృతాంధ్రములందు సమాన పాండిత్యము, యుద్ధవర్ణనలో దీర్ఘసంస్కృతసమాసములు, వెన్వెంటనే అలతిఅలతి తేటతెనుగు పదములు , ఒక్క సారిగా హ్రస్వాక్షరములు గుప్పించుట సమంజసమైన రీతిలో ప్రదర్శించెను.
సౌందర్యవర్ణనలో పునరుక్తి లేక అర్థ ప్రాముఖ్యత , చక్కని దృశ్యచిత్రణ చేసి తన భావనా శక్తి ప్రదర్శన చేసెను. ముఖ్యసుగుణము ఎక్కడా కుంటుతనము లేకుండుట, శృతి సుఖము, మృదుత్వము ఒకే విధమగు గమకము పాటించుట విశేషము. కావ్యమునకు ఆత్మయగు వ్యంగ్యరచనా చమత్కృతి, ధ్వని స్ఫురణము మృదుపదభావములు జనరంజకములైనవి.
                          &&&&&&&&&&&&&&&&&&&&&&

                                            తంజాపురాంధ్రవీణ

             తంజాపురాంధ్ర నాయకులలో కవిరాజు రఘునాథభూపాలుడు సామాన్యులకు అందుబాటులో తేవలెనను ధర్మసంసంకల్పం కొఱకు, కీర్తికొఱకు సంగీతసుధ రచించెను.
మెట్లను మాటిమాటికి రాగమునకు తగినట్లు మార్చుకొను రీతికి స్వస్తి చెప్పి మెట్ల సంఖ్య పలురకములుగ నున్నప్పటికీ రఘునాథుడు ఇఱువది నాలుగుగ నిర్ణయించి ఆధునిక కాలమున ప్రచారముననున్న ఉత్తమవీణా నిర్మాణమునకు తగిన ప్రాతిపదిక చేసెనని నిశ్చయముతో చెప్పవచ్చు.

               సంగీత సుధ ను ఎక్కువభాగము శార్జ్ఞ్గదేవుని సంగీత రత్నాకరమును అనుసరించి రచించినప్పటికీ స్వీయకల్పనలతో ప్రతిభను వ్యక్తం చేయుచూ సులభగ్రాహ్యమగు రీతిలో విషయవివరణ చేసెను.
సర్వగ్రంథముల సారము తెలుపుచూ సంస్కృతములో రచింపబదిన సంగీత సుధ వ్యాఖ్యాన ఉద్గ్రంథముగా తోచును.
స్వర, రాగ , ప్రబంధ, ప్రకీర్ణ, తాళ, వాద్య, నాట్యాధ్యాయములను పేర రచింపబడిన ఈ ఉద్గ్రంథములో చివరిమూడు అలభ్యములు.
                  సప్తస్వరములలోని ఒక్కొక్క స్వరమునకు ఆ పేరు ఎట్ల వచ్చినది, ఎన్నివిధములుగ అంతర్భేదమును పొందినది, దానిలోని వాది సంవాది వివాదాది వివరణలను రాజు, మంత్రి, భృత్యుడు అను ప్రాధాన్యముని చ్చు రీతిలో వరుసగ తెల్పుచు సప్తవర్ణాదులను స్వరములను కనుగొను అధిదేవతలను ఛందస్సులను ఉదాహరణయుక్తముగ వివరించెను.
                  వీణయందు ఇఱువది రెండు శృతులనుండి అరువదియారు శృతులవరకు గల భేదములను వివరించెను.
            నాదోపాసన వలన కలుగు ఫలితములను నాదనిర్వచనమును చెప్పునపుడు సులభతమ నాదావిష్కరణము నందు కల సూక్ష్మస్థానములను చెప్పెను.   పదునైదు మేళములను మొదట పేర్కొని పిదప వీణయందలి ముఖ్యములగు మేళములను నిరూపించెను.
                అంతకంటె విపులముగ తన పూర్వ శాస్త్రకారులు తెలిపిన శుద్ధమేళ వీణ , మధ్యమేళ వీణలను తెలుపుటే గాక తను స్వయముగా సృష్టించి నిర్మింపచెసి ప్రచారణకు తెచ్చిన రఘునాథ భూప మేళవీణ అను కొత్తవీణను మిక్కిలి విపులముగ వర్ణించెను.

           రఘునాథ భూపాలుడు తనకు పూర్వమే రచియింపబడిన అన్ని సంగీత శాస్త్రగ్రంథములను, నాట్యశాస్త్రగ్రంథములను కూలంకషముగ చదివి, పాండిత్యమును సంపాదించుకొని, వాని యన్నింటి సారాంశమును గ్రహించి పరస్పర మతభేదములను సమన్వయపఱచి, స్వీయమతమును కూడ అందు మేళనము చెసి, స్వేచ్ఛారీతిలో ఈ సంగీత సుధను చక్కని ప్రబంధశైలిని సంస్కృతమును కనుపింపచేయుచు సుగ్రాహ్యముగనే రచించెనని, విద్వాంసులకేకాక సామాన్యపండితులకు కూడ అర్థమగు రీతిలో అనుభవజ్ఞానమును స్ఫురింపజేయుచు, ఈ మహా ప్రబంధమునందలి మతములను అధికజనసమ్మతమగు విధానములో నిర్వచన లక్షణలక్ష్యాదులను సుబోధకములుగ రచియించి మహోన్నత్త కీర్తి శిఖరములను అధిరోహించెను.

----"మహాకవి రఘునాథభూపాలుడు" -పరిశోధనాగ్రంథము-- డాక్టర్ ఆర్ ఎల్ కామేశ్వరరావు