Loading...

21, ఏప్రిల్ 2014, సోమవారం

తలో నలుగురితో ఏం సాధిస్తారు?


            నలభై మంది సభ్యులు ఇక్కడ్నించి ఉన్నప్పుడే గౌరవంగా, మర్యాదగా ఏమీ సాధించలేకపోయినాక ఇప్పుడు ముక్కలుగా విడగొట్టేసిన వాళ్ళదగ్గరకేపోయి, ఇప్పుడున్న ఇన్ని పక్షాల వాండ్లూ తలో నలుగురు సభ్యులతో ఏమి సాధించుకొస్తారు? బలమున్నప్పుడే కుక్కల్ని గొట్టించినట్టు కొట్టించినారు. పిలిచి మాట్లాడేంత మర్యాదకూడా ఇయ్యలేదు. తెలంగాణలో ఉద్యమం జరిగినపుడు వాళ్ళను పట్టించుకోలేదు. విడగొట్టవద్దనే ఉద్యమం జరిగినప్పుడు వీళ్ళను పట్టించుకోలేదు.

              అందరూ అన్ని పక్షాలూ స్వలాభం ఎక్కడుంటుందో అక్కడే ఉన్నారు.జనాల ఆవేశాల్ని ఎట్ల రెచ్చగొడితే తమకు నాలుగు ఓట్లు రాలతాయో చూసుకున్నారు. రెచ్చగొట్టడం అంటే అంతింత కాదు. నోటి కొచ్చినదంతా కూస్తున్నారు. సామాజికమర్యాదలనే మాటలీ గాలిలో కొట్టుకొనిపోయినాయి. అసలు విషయం లేనప్పుడే తిట్లు బయటికొస్తాయి అనేది జగమెఱిగిన సత్యం. రెండు మూడు జిల్లాల ప్రాబల్యం లేనివాళ్ళు కుట్రలు చేసి రాష్ట్రాల భవితవ్యం నిర్ణయిస్తున్నారు. కొందరు తమ రాష్ట్రంలో నివసించే తమ పౌరులనే సెట్లర్స్ అని వ్యవహరిస్తున్నారు. వాళ్ళకు వంతపాడే కొందరు మా కోపమంతా సీమాంధ్ర నేతలపైనే జనాలమీద కాదు అని రంగులు పూసి అందంగా చూపించుకొనేవాళ్ళు ఈ సంగతులకేమంటారు? అసలు పలకరు.

             ఏ సంగతులకంటే హైదరాబాదు లో ఉన్నవాళ్ళను సెట్లర్స్ అనడం, పెన్షనర్లు కూడా ఇక్కడ ఉండకూడదనడం, తొంభైశాతం ఉద్యోగులు అక్రమంగా వచ్చినవాళ్ళేననడం , వాళ్ళు తల్లిదండ్రుల స్థానికత ఆధారం గా పోవాలనడం, భవనాల్లో పంపకాల్లో కూడా ఒకరి మొహం ఒకరు చూడకుండా ఉండే ఏర్పాట్లు జరగాలనడం, సీమాంధ్రలో నేతలవెంట ఉన్న వాళ్ళను తెలంగాణ ద్రోహులనడం ఇవన్నీ ఏమంట? ఇవి నేతల మీద కోపాలా? కాదు , సీమాంధ్రులమీద నిప్పులు కక్కడం. తెలంగాణ రాయలసీమ కోస్తా ప్రజల్లో ఒకరిమీద ఒకరికి లేని ద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే మనుషులు, పక్షాలు దిక్కు లేకుండా పోతే తప్ప ఈ పరిస్థితి మారదు. అదీ జరిగింది. మళ్ళీ వాళ్ళని తమ తమ ప్రయోజనాల కోసం పెంచి పోషించిన వాండ్లున్నారు గదూ!

              కాబట్టి ఈ పరిస్థితికి ఇప్పట్లో అంతం లేదా? ఎప్పుడూ పరస్పరం కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉండాల్సిందేనా? అభివృద్ధీ జరగదు. బలంగా ఉన్నప్పుడే మాటకు లేని విలువ ఇప్పుడు తలోపార్టీకీ వచ్చే నలుగురైదుగురు సభ్యులతో ఎటూ రాదు. భాజపకు ఇక్కడ ఏమంత బలముందని వాళ్ళు స్థానిక పార్టీల పైన పెత్తనం చేస్తున్నారో అర్థంకాదు. తెలుగుదేశానికి ఆత్మవిశ్వాసం చాలక వాళ్ళు చెప్పినట్టు వినడమా? కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం దేశ భవిష్యత్తు కుమంచిది. అదే విధంగా ఇక్కడ కూడా ఒకే పక్షం బలంగా వస్తేనే అభివృద్ధి అంతో ఇంతో జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఏమీ లేదు.

                     పక్కరాష్ట్రం వాళ్ళ మాట కాంగ్రెస్ ఎట్లా వింటుందో భాజపా కూడా అంతే అనిపిస్తుంది. ఇక్కడి స్టార్ లు అక్కడికి పోయి మోడీని కలుస్తారు. మోడీ గెలవాలని ఆకాంక్షిస్తారు. పక్కరాష్ట్రం స్టార్ ల దగ్గరికే పోయి మోడీ మాట్లాడుతాడు . అయినా వాళ్ళు రాజకీయాలు మాట్లాడనే లేదంటారు. కాబట్టే భాజప వచ్చినప్పుడూ వాండ్ల రాజ్యం ఇప్పటి వెలుగులే వెలుగుతుంది. మన రాష్ట్రం (రాష్ట్రాలనలేను) ఇప్పటి ఏడుపే ఏడుస్తుంది. ఈ విధంగా నిరాశావాదంలోకి రాష్ట్రాన్ని నెట్టేసిన నేతలందరికీ భవిష్యత్తు లేదని తెలుస్తూనే ఉంది. ఇప్పటికీ సగం మంది పోటీ చేయడం లేదు. మిగిలినవాళ్ళకూ ఈ ఉసురు తగలక మానదు. ఇవి చేతకాని ఏడుపులనిపించవచ్చు. అవును , నిజమే. ఏమీ చేయలేక చేతకాక చేవచచ్చిన రాజ్యం మనది. ఇక్కడ్నించి ఇంతకన్నా ఎక్కువ ఆశించడాలూ, సింగపూర్ల కలలూ అన్నీ పబ్బంగడుపుకొనే మాటలే. ఎవరూ నమ్మడం లేదు.