Loading...

17, డిసెంబర్ 2011, శనివారం

కబుర్లు (కాకరకాయల్లేవు)



                                 తిల తండుల న్యాయము అంటారుట. అంటే నువ్వులు, బియ్యము కలిసి ఉన్నట్లు. తిల అంటే నూగులు, తండుల అంటే బియ్యము. ఇవి కలిపి ఉంచితే కలిసినట్టే ఉంటాయి.విడదీస్తే ఇట్టే విడిపోతాయి. బహుశా తోడికోడళ్ళు, తోడల్లుళ్ళలాగా అన్నమాట. కలిసి ఉంటే బాగున్నట్టే ఉంటారు. విడిపోవాల్సి వస్తే సంకోచించటం, బాధపడటం ఏముండదు. అంతేనా!

           మనము సంఖ్యల పేర్లు నేర్చుకోవటంలో శతకోటి వరకూ సాధారణంగా వాడుతుంటాము.
కానీ  తర్వాత....శతకోటి, అర్బుదము, న్యర్బుదము, ఖర్వము, మహాఖర్వము, పద్మము, మహాపద్మము , క్షోణి మహాక్షోణి, శంఖము, మహాశంఖము, క్షితి, మహాక్షితి, క్షోభము , మహాక్షోభము, నిధి, మహానిధి, పర్వతము, పరార్ధము, అనంతము, సాగరము, అవ్యయము, అమృతము, అచింత్యము, అమేయము, భూరి, మహాభూరి అని ముప్పదియారు స్థానసంజ్ఞలు అంటే అంకెల పేర్లున్నాయట మన భాషల్లో. మనము ఒకట్లు, పదులు , వందలు, వేలు, పదివేలు, లక్ష, పదిలక్షలు, కోటి, పదికోట్లు, వందకోట్లు (శతకోటి) దగ్గరే ఆగిపోయాము.
అంటే ఇంకా 26 ఎక్కువ ఉన్నాయి.ప్రాచీన భారతీయ గణిత విజ్ఞానంలో అన్నింటి కన్నా పెద్ద సంఖ్యగా "తల్ల క్షణం"నే చెప్పుకుంటారు.ఒకటి పక్కన 53 సున్నాలు పెట్టాలి. ( క్రింది వ్యాఖ్యలో శర్మ గారిచ్చిన సమాచారం.)

    మర్కటకిశోరన్యాయము అంటారే అంటే తల్లికోతిని గట్టిగా కర్చుకొని పిల్లకోతి ఉంటుంది.తల్లి కొమ్మలు, గోడలు ఎగిరినా , ఏంచేస్తున్నా తల్లి పిల్ల ఉండే స్పృహ లేకుండా తన పాటుకు తను ఉంటుంది. పిల్ల మాత్రం తల్లిని వదలనే వదలదు. క్రిందపడదు. చూట్టానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దీనికి సరిగ్గా వ్యతిరేకమైనది మార్జాలకిశోరన్యాయము. అంటే తల్లి పిల్లి తన పిల్లలను నోట కరచుకొని పోతూఉంటుంది. దీనిలో పూర్తిగా తల్లిపిల్లిదే బాధ్యత.ఇప్పుడు చాలామంది మనుష్యులు కూడా ఒక సంచీ తగిలించుకొని నడుస్తూఉంటారు. వాటిలో పిల్ల వేలాడుతూ ఉంటుంది. కోతి పిల్లకున్న అలవాట్లు మనిషిపిల్లకెలా వస్తుంది? అది పడిపోతే అప్పుడు తెలుస్తుంది.

          న హి సర్వ స్సర్వం జానాతి అంటే ప్రతి ఒక్కరూ, అన్ని విషయాలు తెలుసుకోవటం అసంభవం. ఒక్కరికి ఎన్ని విషయాలు తెలిసినా ఇంకా తెలియనివి ఉండవచ్చు. అవి ఇంకొకరికి తెలిసి ఉండవచ్చు. అలా ప్రతి ఒక్కరికి కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. ఏదీ తెలియనివారని ఎవరినీ తీసిపారేయటానికి లేదు.అని అర్థము.

          కాకతాళీయం అంటే కాకి తాటి చెట్టు మీద వాలినపుడే తాటిపండు రాలితే కాకి వల్లే రాలిందనుకోవటం తప్పు. రెండూ వాటి ప్రమేయం లేకుండా ఒక్కసారే జరిగాయని అర్థము.
   
            ఇప్పుడు జరుగుతున్న ఖర నామ సంవత్సరము ప్రభవాది అరవై సంవత్సరాలలో ఇరవయ్యైదవది.