Loading...

2, జులై 2011, శనివారం

విజయ గీతాలు వెలివడేదెప్పుడు?

అందరాని హిమశిఖరం చేతులు చాచి పిలుస్తోంది

నవమి చంద్రుని సన్నటి వెన్నెల వెలుగురేఖలు
చెట్లనీడలతో కలిసి తెలుపు నలుపుల రంగవల్లులు దిద్దుతున్నాయి

తోడొచ్చేవాళ్ళెంత మంది ఉన్నా ఎవరి గమ్యం ఎటువైపో
ఎప్పుడు దారులు విడిపోతాయో తెలియని సందిగ్ధతలు
అప్పుడప్పుడూ తొంగి చూస్తూ భయపెడుతున్నాయి

తడబడు బుడిబుడి అడుగుల చిఱుకొలతలతో
ఎప్పటికి తరిగేను ఈ దూరము ?
కనుల గవాక్షాల్లో కదలాడే బిడియపు సంకెళ్ళు చీల్చుకొని
అధర ద్వారం నుండి విజయ గీతాలు వెలివడేదెప్పుడు?
                                         ----లక్ష్మీదేవి
  

27, జూన్ 2011, సోమవారం

మాలతిగారి వ్యాసంలో ఒక మాట -మనకింత మంది రచయితలు ఉన్నారా !!మాలతిగారు సవివరంగా చక్కటి వ్యాసం రాశారు. వారి వ్యాసంలో ఒక మాట మనసును కదలించింది. నోరి నరసింహ శాస్త్రి గారు పరిచయం చేసిన రచయితల గురించి చెపుతూ ఆవిడ అన్నారు-మనకింత మంది రచయితలు ఉన్నారా అని. నేనూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటూ ప్రతీసారీ ఆశ్చర్య పోతూ, ఆనందపడుతూ , బాధపడుతూ అనుకునే మాట ఇది.

ఇందరు మంచి రచనాకారులు ఉన్నారా అని ఆశ్చర్యం, వారి గురించి చదవగలిగినందుకే ఆనందం, అక్షరాస్యత ఇంతగా పెరిగినదని చెప్పుకోవటమే కాని, షేక్స్పియర్ తెలిసినంత మందికి మన పుట్టపర్తి నారాయణాచార్యులు గురించి తెలీదే అని బాధ. పొరుగింటి పుల్లకూర మీద మోజుతో మన పంచభక్ష్యాలని వదిలేసుకోవటం లా ఉందిది. .

ఏదో మొక్కుబడిగా తెలుగు మాధ్యమం విస్తృతంగా ఉన్న రోజుల్లోనే కాన్వెంట్లు ఎక్కువ లేని రోజుల్లోనే తెలుగు వాచకం ఎంత చిన్నదిగా ఉండేది! సైన్స్, మాథ్స్ పుస్తకాలు ఎంత పెద్దవిగా ఉండేవి? తెలుగు మీద గురువులకే శ్రద్ధ లేదు. అన్నిటికీ ట్యూషన్ కి వెళ్ళే వాళ్ళు కూడా తెలుగులో పాస్ అయితే చాలు అనుకోవటం, హిందీయో ,సంస్కృతమో తీసుకుంటే మార్కులు ఎక్కువ పడతాయి అనుకోవటం. ఆ భాషలయినా సమగ్రంగా నేర్చుకుంటే పర్లేదు. అదీలేదు. ఇంటర్మీడియట్ స్థాయిలో తీసుకుంటే అక్షరాలు నేర్పటం, లేదా సమాధానాలుఅన్నీ ఇంగ్లీషులో (కాన్వెంట్లో) రాయటం.

ఈ నిర్లక్ష్యం ఎందుకు వచ్చిందంటే ఆ....ఏముంది, తెలుగు మనం మాట్లాడేది తెలుసుకుంటే చాలు. వ్యవహారికం లో రాయగలిగితే చాలు ,అంతకుమించి అనవసరం అనుకోవటం వల్ల. కానీ తరాలకు తరాలు ఇలా ఉండటం వల్ల ఏమయింది? ఇప్పుడు మన అలవాట్లు, ఆచారాలు ఎందుకున్నాయో మనకు తెలీదు. ఏదో మొక్కుబడిగా చెయ్యాలి , తప్పదు అనుకుంటూ, ఏ నెట్లోనో చూసి నచ్చిన వరకూ చేయటం. తరాలకు తరాలు గుడ్మార్నింగ్ చెప్పుకోవటంలో ఉన్న మోజు పిల్లలు పాదాలకు నమస్కారం చేసినపుడు ఆశీర్వాదం చేయటానికి నామోషీ. అబ్బే, మనం స్నేహితులం అయ్యో నేనేమంత పెద్దనికాను - ఇది మన సంస్కారాలపై అవహేళన .ఒక రోజు పెద్ద అయినా సరే మనం ఆశీర్వాదం చేస్తే విషెస్ చెప్పినట్టే,కోరినట్టే అని ఎందుకు అనుకోరు?

మన వాళ్ళల్లో ఎంతమంది చక్కగా రాయగలరో మనకు తెలీదు. ఏం రాశారో తెలీదు.అవన్నీ చదివితే సంస్కారం అలవడేది. అదేదో అజంతా విషయం అనుకోవలసిన పనిలేదు. మన ఇంట్లో పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో తెలిసేది.సమాజానికి ఎలా ఉపయోగపడాలో తెలిసేది. ఇవన్నీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవటానికి పనికి వస్తాయి.
పదవతరగతి అయ్యాక అందరూ ఇంజనీరింగ్ లూ డాక్టర్లూ అవుతారని అనుకోకపోయినా, అందరికీ బల్బ్ ఎలా తయారుచేస్తారు, ధర్మామీటరు ఎలా పనిచేస్తుంది, కప్ప ను కోసి భాగాలు తెలుపటాలు, వడ్డీ లెక్కలు వేయటాలు ఎందుకు నేర్పిస్తున్నారు? ఒకవేళ చదవాలంటే ఫండమెంటల్స్ తెలియాలని . కదా! చదువు మానేసే వాళ్ళకి అవి నేర్చుకున్నా ఉపయోగం లేదు. అయినా నేర్పిస్తున్నాం. అలాగే జీవితంలో మనం ఉపయోగించుకుంటామో లేదో మన వాళ్ళు రాసినవన్నీ పరిచయం చేయవచ్చు కదా, చేయనే చేయరు.

మా తెలుగు పంతులు గారు నాకు తెలుగు రావటంలో ఏ పాత్ర పోషించలేదని చెప్పను గానీ, పాఠాలు చెప్పటం , పరీక్షలు పెట్టటం మించి ఆ యన ఏమీ ప్రోత్సహించే వారు కాదు. నేను ఇపుడిపుడే పద్యాలు రాయటం నేర్చుకోటానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ తొమ్మిది, పది తరగతుల్లోనే వారు ప్రోత్సహించి ఉంటే ... ఏ విషయమైనా పద్యరూపంలో చెప్పటానికి ప్రయత్నించమనో లేక స్వంతంగా ఏ వ్యాసాలో రాయమనో చెప్పిఉంటె... అబ్బే..

అదేమీ లేదు. అలా అయిఉంటే నేనేదో పెద్ద రచయిత్రిని అవుతానని కాదు. కనీసం మంచి పుస్తకాలెన్నో చదవగలిగే పాండిత్యం అబ్బి ఉండేదికాదా! ఇప్పుడు మనలో ఎంతమంది విశ్వనాథవారి పుస్తకాలు చదివి సమీక్షలు వ్రాయగలం
చెప్పండి?

మా సంస్కృతం పంతులు గారు నయం. సంస్కృతం ఇప్పుడు పుస్తకాలు చదవటానికి మాత్రమే ఉపయోగపడేదైనా సరే, కనీ సం వార్తలు వినండి రేడియోలో అని ఎంతో ప్రోత్సహించేవారు. అర్థం కాలేదనుకోకండి, కొన్ని రోజులు వింటూ ఉండండి. తప్పకుండా అర్థం అవుతుంది. అనేవారు. అబ్బే .. మేము వినలేదు. ఇప్పుడే తెలుస్తోంది ఆ మాటల విలువ. మన చదువుల విలువ కూడా ఇపుడే తెలుస్తోంది.


(మాలతి గారికి మరీ మరీ ధన్యవాదాలు.అక్కడ వ్యాఖ్య రాయబోయి మరీ పెద్దదిగా ఉందని ఇక్కడే రాసుకున్నాను మాలతిగారూ!)
-మందాకిని