Loading...

10, మార్చి 2011, గురువారం

విభజించి పాలించే దురాచారం

ఈ సారి భాగ్య నగరం వెళ్ళినపుడు విగ్రహాలన్నింటినీ చూడాలని ఎంతగా అనుకున్నానో! 17విగ్రహాలను పగులగొట్టేశారంట కదా! తలచుకుంటే ఎంతో బాధగా ఉంది. చేసినవాళ్ళు ఏ నక్సలైట్ లో అయితే చర్య తీసుకోమంటాం. అందరూ మన వాళ్ళే , మన అన్నదమ్ములే. బాధపడటం మినహా ఏం చెయ్యగలం?
మన పెద్దవాళ్ళు, పుణ్యాత్ములు, సమాజం కోసం జీవితాల్ని త్యాగం చేసినవాళ్ళ మీద ఏమిటి ఈ కోపం?
సోనియా నైతే కాళ్ళు పట్టుకుంటారట. మన పెద్దవాళ్ళనైతే ఈ విధంగా అవమానిస్తారా? ఏమిటిది? ఎక్కడికి పోతున్నాం మనం?
రెండు వైపుల వాళ్ళకీ మనసులు గాయపడ్డాయి అనే చెప్తున్నారు. ఇంతగా గొడవపడి విడిపోయిన రాష్ట్రాలు ఏవయినా ఉన్నాయా?
ఇదంతా కాంగిరేసు వాళ్ళ పుణ్యం. విభజించి పాలించే దురాచారాన్ని ఆంగ్లేయుల నుంచి పుణికి పుచ్చుకున్నారు. తమకు అధికారం ముఖ్యం. అందుకు ఏమయినా చేస్తారు.
ఏ ఏ రాష్ట్రాల్లో పెద్ద గొడవలు ఏమయినా జరిగినా అది వాళ్ళ హస్తమేనని , ప్రాంతీయ పక్షాలు అనేవి ఉండకూడదనేదే వాళ్ళ ధృఢ నిశ్చయమని అందరికీ తెలిసిందే.
అయినా వాళ్ళేదో చేశారని మనం ఏడిస్తే ఏమొస్తుంది? మన బుద్ధి మనకు ఉండాలి. మనకు ఐకమత్యం లేనపుడు పరాయివాడు వచ్చి తన లాభం చూసుకుంటాడు. పిల్లీ పిల్లీ రొట్టెముక్క కోసం కొట్లాడుకుంటూ ఉంటే మధ్య వచ్చిన కోతి లాభపడిపోతుంది.
తెలుగు తల్లి పిల్లలమైన మనందరం కలిసి మెలిసి ఉండాలని, మన సంస్కృతి, భాష లను మనం కాపాడుకొని భారతీయ సమాజంలో మన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోవాలని మనకు ఏ కోశానా లేనప్పుడు ఇలాగే జరుగుతుంది. కలిపికట్టుగా ఉంచగల శక్తి సాహిత్యానికి, సంప్రదాయాలకి ఉంది. అవన్నీ వదులుకున్నపుడు మనం తేలిగ్గా తీసుకున్నాం. ఇపుడు ఫలితాలు కళ్లముందున్నాయి.

6, మార్చి 2011, ఆదివారం

సరిక్రొత్త నిఘంటువు - సరిక్రొత్త హంగులతో - తెలుగు లోకానికి మన బ్లాగర్ల కానుక.

http://www.telugunighantuvu.org/

ఈ చిరునామాలో , తెలుగు నిఘంటువు అనే పేరుతో రంగులతో, హంగులతో అలరారుతూ తెలుగు భాషానురక్తులకు,
1. తెలుగు పదములు, పద్యములు, వ్యుత్పత్తి తెలుసుకోగోరే వారికి,
2 .తెలుగుని ఇతర భాషలోని పదాలతో పోల్చి చూడాలనుకునేవారికి,
3.ఆ యా పదాల్ని పద్యంలోనూ , వచనం లోనూ ఎలా ప్రయోగించారో నేర్చుకోడానికి,
4. పర్యాయ పదాలకోసం వెతికేవారికి,
5. ఒక్కో పద్యానికీ ఛందోరూపం తెలుసుకోవాలని కొన్ని ఉదాహరణలు కావాలనుకునేవారికి,
6. అసలు మన తరానికి నేర్పింపఁబడని బండి ర (ఱ) అంటే శకటరేఫనీ, అరసున్నా నీ ఎలా వాడేవారో తెలుసుకోవటానికీ
ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగ పడే ఈ మన నిఘంటువు ని చూస్తారా? అయితే
ఇక్కడ నొక్కండి.

ఇందులో మనం టైప్ చెయ్యగానే పదం తెలుగులో టైప్ అవుతుంది. అందులో ఉన్న పదాలని డిస్ ప్లే చేస్తుంది. అందులోంచి మనకు కావలసిన పదాన్ని ఎంచుకొని ఎంటర్ కొడితే , ఇక ఆ పదం యొక్క అర్థం, ఇతర రూపాలు, వ్యుత్పత్తి, ప్రయోగం, పద లక్షణము (విశేషణమా, ఇంకోటా అనేది) ఇతర భాషారూపాలు అన్నీ కనిపిస్తాయి.
ఈ సరికే కొన్ని తెలుగు నిఘంటువులు ఉన్నా, అందులో కేవలం అర్థం మాత్రమే ఇస్తారు.
"బహుళ శోధన" లో పర్యాయ పదాలు, కొన్ని ఛందో రూపాలకు లభ్యంగా ఉన్న ప్రయోగాలు చూసుకోవచ్చు.

పనిలో పని - అక్కడ ముంగిలిలో కనిపించే సరస్వతీ దేవి ప్రసన్నరూపాన్ని చూడండి. నేను రాసిన మన తెలుగు పాటని కూడా చూడండి.
సూర్యరాయాంధ్ర నిఘంటువుని డిజిటలైజ్ చెయ్యటం అనే ఈ గొప్ప పనికి అంకురార్పణ చేసి, బహు విధ సేవలు అందిస్తూ , నిరంతరం శ్రమిస్తున్న భాస్కరరామిరెడ్డి గారికి నా అభినందనలు.
ఇతోధికంగా ఆర్థిక సహాయాన్ని, సాంకేతిక సహాయాన్ని, యూనికోడ్ లో వ్రాసి సహకరిస్తున్న మిత్రులందరికీ (నాతో సహా) అభినందనలు. ఈ పని చేసే వారిలో కొంతమంది బ్లాగర్లు కాని వారు కూడా ఉన్నారు. వారికీ అభినందనలు.
మనకి మనమే చెప్పుకోవాలి అభినందనలు అని ఇలా...
ఇంకా ఈ నిఘంటు దోగాడే పాపలా తొలిదశలోనే ఉంది కాబట్టి , అయినంతవరకూ పదాలని చేరుస్తూ ఉన్నాం. త్వరలోనే పూర్తిగా అందించ గలమని ఆశిస్తున్నాను.
భాస్కరరామిరెడ్డి గారు అందిస్తున్న మరిన్ని వివరాలు చూడండి.