Loading...

4, జూన్ 2010, శుక్రవారం

అనగాఅనగాఅనగా....

మధురవాణి గారు అనుమతిచ్చేశారు కనుక, నిజంగానే కొంచెం తేడా ఉంది కనుక, నాకిష్టమైన ఈ కథ నేనూ నా బ్లాగులో రాస్తున్నాను.
అనగా అనగా ఒక ఉసిరికాయంత ఊళ్ళో ఒక చింతకాయంత చిన్నోడు ఉండేవాడట. వాడు కష్టపడి డబ్బులు సంపాదించి, వంకాయంత వజ్రాన్ని కొన్నాడట. వంకాయంత వజ్రాన్ని తన బీరకాయంత బీరువాలో దాచాడట. తాటికాయంత తాళం వేశాడట. ఆ చింతకాయంత చిన్నోడు పని మీద బయటికి వెళ్ళినపుడు ఆ వంకాయంత వజ్రాన్ని దొండకాయంత దొంగ ఎత్తుకెళ్ళి పోయాడట.

చింతకాయంత చిన్నోడు రాగానే తన వంకాయంత వజ్రం కనపడక పోవటం చేత ఏడుస్తూ వెళ్ళి పొట్లకాయంత పోలిసుతో చెప్పాడట. అప్పుడు ఆ పొట్లకాయంత పోలిసు ఆ దొండకాయంత దొంగని వెతికి పట్టుకుని వంకాయంత వజ్రాన్ని లాగేసుకుని, ఆ దొండకాయంత దొంగని జామకాయంత జైల్లో పెట్టాడట.

ఆ పొట్లకాయంత పోలీసు చింతకాయంత చిన్నోడిని పిలిపించి ఆ వంకాయంత వజ్రాన్ని ఇచ్చేశాడట. వెంటనే ఆ చింతకాయంత చిన్నోడు ఎంతో సంతోషంగా తన వంకాయంత వజ్రాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ తన బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసి హాయిగా నిద్ర పోయాడట.

ఇపుడు ఈ కథ అందరికీ తెలుసు. మళ్ళీ మేమెందుకు ఊ(.. కొట్టాలేం? అంటారని నాకు తెలుసు.
అయినా ఏమో వింత మోహం...