Loading...

26, ఫిబ్రవరి 2009, గురువారం

మా తాతయ్యలు

మా తాతయ్య వయసులో ఉన్నప్పటి ఫోటో చూస్తే ఎన్. టి. ఆర్ లాగే ఉండేవారు. ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు ,నిండైన విగ్రహం,చూడడానికి గంభీరంగా ఉండేవారు. వయసయ్యాక ఎన్. టి. ఆర్ లాగే లావుగా అయిపోయారు.

పుట్టింది 1910 లో కాబట్టి ఆకాలపు పదవ తరగతి చదివినా ఆంగ్లంలో కవితలు రాసేవారట. (చదువుకునే రోజుల్లోనే,) అప్పుడు నేను కొంచెం పొట్టిగా ఉండటంతో నన్నెప్పుడూ పొట్టి, పొట్టి అని ఏడిపించేవారు. నావయసే ఉన్న మా చిన్నాన్న కూతురు పొడుగ్గా ఉండటంతో నాకు చాలా ఉక్రోషంగా ఉండేది. (తర్వాత నెను పొడుగు పెరిగాను.అది చూడకుండానె ఆయన పోయారని నాకు చాలా బాధ.)
షుగర్ ఉండటంతో ఎప్పుడూ మంచినీళ్ళు అడిగేవారు. నేను ఒపిగ్గా తెచ్చి ఇస్తే, అది ఇవ్వదు, అది చెండి, చాముండి అని మా చిన్నాన్న కూతుర్ని మెత్తగా విసుక్కునేవారు. అప్పుడు నాకు సంతోషం.
అదంటె నాకు ప్రాణం. ఎందుకో చిన్నతనంలో ఆపోటీలు.
ఎప్పుడు బయట అరుగు మీద కూర్చుని భగవద్గీత లోని పద్యాలు రాగయుక్తంగా చదివేవారు. అలా వినినందువల్లే గీత లోకృష్ణుడు చెప్పిన విషయాలమీద ఆసక్తి పెరిగింది. (నేను ఆరవ తరగతి చదివేటప్పుడు గీత శ్లోకాల పోటీ లో మొదటి బహుమతి గెలుచుకున్నానోచ్!)


మా తాతగారి తో మేమే కాదు, మా నాన్న, చిన్నాన్నలు కూడా సరదాగా స్నేహితుల్లా రాజకీయాలు, ఇంకా ఎన్నో విషయాలు గల గలా మాట్లాడుకునే వారు. అర్థం కాని వయస్సులో కూడా వినడం భలే సరదాగా ఉండేది.
ఇక ఇంకో తాతయ్య (అమ్మకు నాన్న)గురించి తలుచు కుంటే అంతా వ్యతిరేక అనుభవం. ఈ తాతయ్యను చూడడానికి ఎండాకాలం శెలవల్లో తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళం. రైలు, బస్సు, ఎద్దుల బండి(ఒక్కోసారి జట్కా బండి. రెండూ తాతయ్య సొంతం.)

ఈ ప్రయాణం భలే ఇష్టంగా ఉండెది. పాసెంజెరులో నిదానంగా బస్సులో జనంలో అవస్థలు పడి, దిగంగానే మాకోసం బండి ఎదురు చూడం భలే థ్రిల్లింగ్ గా ఉండేది. మమ్ములను చూడగానే విప్పి ఉంచిన ఎద్దుల్ని బండి కి కట్టేవారు. వేసవి కదా పంటలు ఉండవు. భూమి నల్లగ కాటుకలా ఉంటుంది దాన్ని చూస్తూ అరగంట ప్రయాణం.
తాతయ్యను చూస్తే భయం. ఎప్పుడూ తిట్టలేదు, కొట్టలేదు. ఎందుకోమరి తెలీని భయం. మా కజిన్స్ అంతా వచ్చేవాల్ళ్ళు. సెలవలంతా వాళ్ళతోనే ఆటలు, మాటలు. తాతయ్య నాకు డాక్టర్ అవమని చెప్పేవారు. నాకు లెక్కలు ఇష్టం అని మొండిగా చెప్పినా కోపగించకుండా, డాక్టర్ అయితె ఎవరి దయ లేకుండా మనమే బోర్డ్ వేసుకోవచ్చు అని చెప్పేవారు.

ఆమాట నిత్యసత్యమని ఇప్పుడు ఇంజనీర్లని చూస్తే తెలుస్తుంది. వాళ్ళు ఇంట్లో కన్నడ మాట్లాడేవారు. నన్ను నేర్చుకోమని చెప్పేవారు. నీకు ఒక భాష అదనంగా వస్తుంది కదా అని నచ్చచెప్పెవారు. మొండిగా నేర్చుకోకుండా ఉండిపోయాను. కానీ ఇప్పుడు చక్కగా కన్నడ, తమిళ్ మాట్లాడగలను. వినడానికి, సంతోషించడానికీ తాతయ్య లేరు.
ప్చ్!.. ఏమిటో!